పూర్ణ వందేమాతరం..దేశభక్తితో గాయక శ్రీకారం

“వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్ల కుసుమిత ద్రుమ దళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం….”

జనగణమన కన్నా దాదాపు ముప్ఫైఏళ్ల ముందు రాయబడిన వందేమాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. విన్న వెంటనే మనలో ఓ గగుర్పాటు కలిగించే మన జాతీయ ఆలాపనలో ఎంతో చక్కని పదాలను మిళితం చేస్తూ బంకిం చంద్ర చటర్జీ రచించారు. మొదట వందే మాతరంలో ఐదు చరణాలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల మొదట రెండు చరణాలతోనే భారత ప్రభుత్వం వందేమాతరం ను జాతీయ గీతంగా గుర్తించింది. అయితే మరి ఐదు చరణాలు అప్పటి నుంచి ఎవరూ పాడలేదా అంటే… ఇప్పటికి భారతదేశం మొత్తం మీద వందేమాతరం పూర్తిగా పాడింది ముగ్గురే ముగ్గురు.

అలా పాడిన పాటల్లో మొదటి దాన్ని ఆలిండియా రేడియో వారు..పాడించి… ప్రసారం చేసారు. తర్వాత తొంభైల్లో ఒకావిడ పాడింది. మళ్లీ ఆ తర్వాత చాలా కాలానికి వందేమాతరం పూర్తిగా ఐదు చరణాలతో పాడటం జరిగింది. అదీ మన తెలుగు గాయకుడు కావటం మనకు గర్వ కారణం. అతని పేరు బుర్రా సాయి. గుండెల నిండా దేశభక్తితో …పాడిన ఈ పాటను స్వరపరిచింది విక్రమ్.ఎమ్.ఎడిటింగ్ మొత్తం గరుడ కంపెనీవారు చేసారు. ఆగస్ట్ 15 సందర్బంగా ఆదిత్యూ మ్యూజిక్ వారు రిలీజ్ చేసారు. మీరు ఆ పాటను క్రింద వీడియోలో వినవచ్చు.

ఇక వందేమాతరం పూర్తి పాట పూర్వాపరాల్లోకి వెళితే..

దీనిని మొట్టమొదటి సారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో ఆలపించారు. 1950లో భారత్ గణతంత్రమైన తరువాత భారత ప్రభుత్వం మొదటి రెండు చరణాలతో ఈ పాటను జాతీయ ఆలాపనగా గుర్తించింది. ఈ గీతం బంకించంద్ర గారి ఆనందమఠ్ అనే నవలలోది. 1876వ సంవత్సరంలో ఆయన ఆనందమఠాన్ని రచించగా 1882వ సంవత్సరంలో అది ప్రచురితమైంది. సంస్కృతం, బెంగాలీ శబ్దాలు కలిగిన ఈ జాతీయ గీతాన్ని స్వరపరచిన వారు జాదూనాథ్ బెనర్జీ.

తొలుత దీనిని జాతీయ గీతంగా గుర్తించాలని ప్రతిపాదన వచ్చినా ముస్లింల వ్యతిరేకతతో జనగణమన జాతీయ గీతం అయ్యింది. వందేమాతరం జాతీయ గీతంగా కావటాన్ని వ్యతిరేకించిన వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకరు. వందేమాతరంలో భరతమాతను దుర్గాదేవిగా ఆవిష్కరించటం ఆనాటి బెంగాలు మరియు ఇతర ప్రాంతాల ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. తదుపరి బాబూ రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అసెంబ్లీలో తీర్మానంతో జాతీయ ఆలాపన అయిన వందేమాతరాన్ని జాతీయ గీతమైన జనగణమనతో సమానమైనదిగా గుర్తింపజేశారు.